హైదరాబాద్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించే ప్రణాళికను తీసుకువచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెట్రో విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఇందులో సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి 76.4 కిలోమీటర్ల మేర రూ.24,269 కోట్ల అంచనాతో తయారు చేసిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ వెంచర్ రూపంలో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా, ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ప్రాజెక్టు కావడంతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీర్‌ఖాన్‌పేట వరకు మెట్రోను పొడిగించాలని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ రూట్‌లో మెట్రో విస్తరణకు అవసరమయ్యే అంచనాలతో కొత్త DPRను సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. HMDAతో పాటు FSDAను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా చేర్చాలని పేర్కొన్నారు. మెట్రో విస్తరణ వల్ల హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు మెరుగవడం మాత్రమే కాకుండా, నగర విస్తరణకు కూడా దోహదం చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నగర అభివృద్ధికి బలమైన బేస్ ఏర్పడనుంది.
ఇది పూర్తయిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ మరింత ఆధునీకృతంగా మారనుంది.