హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని పలు ఎకరాల భూమిని రక్షిత అడవిగా గుర్తించాలన్న డిమాండ్‌తో ఈ సొసైటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సొసైటీ అధ్యక్షుడు రామ్ కల్యాణ్ చల్ల నేతృత్వంలో దాఖలైన ఈ పిటిషన్‌లో యూనివర్శిటీ పరిధిలో అభివృద్ధి పేరిట ప్రకృతి నాశనం అవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. పలు అరుదైన వృక్షాలు, వన్యప్రాణులు, పక్షుల నివాసంగా ఉన్న ఈ అడవి ప్రాంతం విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని వాణిజ్యాభివృద్ధి కోణంలో చూడకూడదని స్పష్టం చేశారు.

ఈ భూమిని నిర్మాణాలు, రోడ్ల మంజూరు వంటి అభివృద్ధి పనులకోసం ఉపయోగించకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇది భవిష్యత్ తరాలకోసం ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యతగా ప్రజలందరికీ ఉండాలన్న సందేశాన్ని పిటిషన్ ద్వారా ఇచ్చారు. పిటిషన్‌లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, యూజీసీ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రతివాదులుగా చేర్చారు.
యూనివర్శిటీ అభివృద్ధి విద్య, పరిశోధన పరంగా సాగాలి గానీ, పచ్చదనాన్ని నాశనం చేసే నిర్మాణాల పేరుతో మౌలిక వసతుల అభివృద్ధి జరగకూడదని ‘బీ ద చేంజ్’ స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ, విద్య అభివృద్ధి పరస్పర విరుద్ధమైనవల్ల కావని, రెండూ సమతుల్యంగా సాగాలని పిలుపునిచ్చారు. పర్యావరణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, పౌరసంఘాలు ఈ న్యాయపోరాటానికి మద్దతు ప్రకటించాయి. “ప్రగతికి ప్రకృతి విరోధం కాదు… రెండు కలసి ఉండాలి” అని రామ్ కల్యాణ్ గారు వ్యాఖ్యానించారు.