తెలుగు రాష్ట్రాల్లో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరు మరణించగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకరు మృతి చెందారు. 13 రోజుల పాటు చికిత్స పొందిన ప్రకాశం జిల్లా అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది.

ఈ ఘటనపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి స్పందిస్తూ, కమలమ్మ మృతి గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా కాకుండా కార్డియాక్ సమస్య వల్ల జరిగిందని స్పష్టం చేశారు. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతోందని, GBS వల్ల మరణాల శాతం 5% లోపే ఉండటంతో ప్రజలు అధికంగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అయితే, ఏపీలో ఒక్కసారిగా ఈ వ్యాధి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఒక్కరోజులోనే ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ముగ్గురు GBS లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 మంది GBS కారణంగా చికిత్స పొందుతున్నారు. కొన్ని కేసుల్లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
GBS లక్షణాలు:
- ఒంట్లో తిమ్మిరి
- కండరాలు బలహీనపడటం
- డయేరియా, పొత్తికడుపు నొప్పి
- జ్వరం, వాంతులు
GBS కు కారణాలు:
కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమవుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారు. నాడీ వ్యవస్థపై ఇది ప్రభావం చూపి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అయితే, సకాలంలో వైద్యం తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.