పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం తుడిచిపెట్టేస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంది. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు పైకి సాగనున్నాయని స్పష్టం చేసింది.

ఈ ఏడాది చివరినాటికి బంగారం ధర రూ.1.25 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు మూడు సార్లు తమ అంచనాలను సవరించిన గోల్డ్‌మన్ శాక్స్, ప్రస్తుతం ఔన్స్ ధరను 4,500 డాలర్ల వరకు చేరుతుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే, భారతదేశంలో బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గోల్డ్‌మన్ శాక్స్—1869లో న్యూయార్క్‌లో స్థాపించబడిన ఆర్థిక సేవల సంస్థ. ఈ సంస్థ రీసెర్చ్, మార్కెట్ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. గత 20 ఏళ్లలో బంగారం ధరలపై ఈ సంస్థ ఇచ్చిన 9 నివేదికల్లో 8 సార్లు అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు ఇచ్చిన తొమ్మిదో నివేదికపై అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకు పసిడి ధర పెరుగడానికి ప్రధాన కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ సుంకాలే. ఇవి అంతర్జాతీయ మార్కెట్‌లో వాణిజ్య యుద్ధాలను ప్రేరేపించాయి. ఇదే సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే పసిడి రేట్ మళ్లీ కొత్త రికార్డులు నెలకొల్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.