టాలీవుడ్‌లో పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తుంటాయి. తాజాగా అలాంటి విజయాన్ని అందుకున్న చిన్న సినిమా “కోర్ట్”. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అపారమైన ప్రశంసలు అందుకుంది. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.57 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శివాజీ, హర్ష్ రోహన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు రామ్ జగదీష్ బలమైన కథనం, నాటకీయతతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. హీరో నాని సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రేమ కథతోపాటు పోక్సో కేసును ప్రధాన అంశంగా తీసుకుని ఆసక్తికరంగా మలచారు.
విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభించగా, ప్రియదర్శి, శివాజీ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన “కోర్ట్” మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చివరికి ఆ రోజు వచ్చేసింది!

నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న తమ ప్లాట్‌ఫారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఈ చిత్రం తెలుగులో మాత్రమే విడుదలైనప్పటికీ, ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వార్తతో “కోర్ట్” అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.