తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి, సామాన్యుడిలా మారిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో పర్యటించిన సీఎం, సన్నబియ్యం లబ్దిదారుడి ఇంటికి వెళ్లారు.

ఆ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి భుజించారు. తాను ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ఎలా అమలవుతోంది, ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతోంది అనే విషయాన్ని నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
భోజనం అనంతరం వారి కుటుంబ జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. తులసమ్మ అనే మహిళతో మాట్లాడిన సీఎం, సన్నబియ్యం నాణ్యత గురించి ప్రశ్నించగా, గతంలో వచ్చిన దొడ్డు బియ్యాన్ని తీసుకునేందుకు ఇంట్లో ఎవరూ ఆసక్తి చూపలేదని ఆమె చెప్పారు. ఇప్పుడున్న బియ్యం నాణ్యతతో కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.
అలాగే, 200 యూనిట్లు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అందుతున్నాయా అని సీఎం వివరంగా ఆరా తీశారు. ఈ పథకాలు తమ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తులసమ్మ తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశంలోనే తొలిసారిగా ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే.