చాపింగ్ బోర్డులు: ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయా?
నేటి మార్కెట్లో రకరకాల చాపింగ్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. డిజైన్, రంగుల పరంగా ఆకర్షణీయంగా ఉండటంతో వీటిని చూసిన వెంటనే కొనాలనిపిస్తుంది. కొందరు ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి చెక్క చాపింగ్ బోర్డులు వినియోగిస్తున్నారు. అయితే తాజా అధ్యయనాలు చెక్క బోర్డులు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని వెల్లడించాయి.

మీ ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? భోజనం తర్వాత అసౌకర్యంగా అనిపిస్తున్నదా? అయితే మీరు వినియోగిస్తున్న చాపింగ్ బోర్డులపై శ్రద్ధ పెట్టాలి. అసలైన సమస్య ఏమిటో తెలుసుకోవడం అవసరం.
చాపింగ్ బోర్డుల అసలు ప్రమాదం!
చాపింగ్ బోర్డుల సంస్కృతి మన దేశానికే చెందని విషయం. గతంలో భారతీయులు కూరగాయలు, మాంసం తరిగేందుకు స్టీల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్, చెక్క చాపింగ్ బోర్డులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం.
చెక్క చాపింగ్ బోర్డులు ప్రమాదకరమేనా?
చెక్క బోర్డులపై తరచుగా కత్తిరించే కారణంగా చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. కూరగాయలు, మాంసం, చికెన్ వంటి పదార్థాలను తరిగినప్పుడు వాటి రసం ఈ రంధ్రాల్లోకి వెళ్లి జీర్ణక్రియను దెబ్బతీసే బ్యాక్టీరియా, శీలింద్రాలను పెంచే అవకాశం ఉంది.
కొంతకాలం తర్వాత, బోర్డుపై గీతలు, పగుళ్లు ఏర్పడి, చిన్న చెక్క ముక్కలు ఆహారంతో కలిసి మన శరీరంలోకి చేరతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
చాపింగ్ బోర్డుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
1. తరచూ జ్వరం రావడం
శుభ్రం చేయని చాపింగ్ బోర్డులపై E. coli, Salmonella వంటి హానికర బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే విరేచనాలు, వాంతులు, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి.
2. ప్రేగులలో వ్యర్థాలు చేరడం
పాత చెక్క బోర్డుల నుంచి వచ్చే చిన్న ముక్కలు, ప్లాస్టిక్ అణువులు ప్రేగులలో చేరి గ్యాస్, అజీర్ణం, ఇతర సమస్యలకు కారణమవుతాయి.
3. బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం
చాలా మంది కూరగాయలు, మాంసం, చేపలు అన్నింటినీ ఒకే బోర్డుపై తరిగే అలవాటు కలిగి ఉంటారు. ఇది తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణకు దారి తీస్తుంది.
ఏవీ ఉపయోగించడం మంచిది?
1. వెదురు చాపింగ్ బోర్డులు
వెదురు బోర్డులు చెక్క బోర్డుల కంటే తక్కువ రంధ్రాలు కలిగి ఉంటాయి. ఇవి నీటిని తక్కువగా గ్రహిస్తాయి మరియు శుభ్రం చేయడం సులభం.
2. గాజు లేదా యాక్రిలిక్ బోర్డులు
ఇవి మృదువుగా ఉండటంతోపైగా రంధ్రాలు ఉండవు. శుభ్రం చేయడం చాలా సులభం.
3. స్టెయిన్‌లెస్ స్టీల్ బోర్డులు
ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, బ్యాక్టీరియా సంక్రమణ అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు వీటిని ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్య సూచనలు
✔️ ఏ చాపింగ్ బోర్డును ఉపయోగించినా రోజూ శుభ్రంగా కడిగేయాలి.
✔️ చెక్క బోర్డులను తరచూ మార్చాలి.
✔️ మాంసం, కూరగాయలు కోసేందుకు వేర్వేరు బోర్డులు వాడటం ఉత్తమం.
(Note: ఇందులోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్యులను సంప్రదించండి.)