బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఛావా ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్కీ కౌశల్ పోషించిన శంభాజీ మహారాజ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. క్లైమాక్స్ సీన్స్ లో ఆయన అందించిన భావోద్వేగ నటన ప్రతి ఒక్కరినీ కదిలించింది.

ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించగా, వీరిద్దరి జంట తెరపై అద్భుతంగా ఆకట్టుకుంది. హిందీలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి స్పందనతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇది విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యంత వసూళ్లు సాధించిన సినిమా.
ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, ఇప్పుడు ఓటీటీకి వస్తోంది. ఏప్రిల్ 11 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతుందా అనే ఆసక్తి నెలకొంది.
కథ విషయానికొస్తే… ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని భావించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్, ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్, మొగల్ సేనలకు తగిన బుద్ధి చెబుతాడు. ఆయన ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, ద్రోహం చేసిన వారెవరు అన్నదే ఈ చిత్ర కథాంశం.














