ఎమ్మెస్ నారాయణను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం
తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం తర్వాత ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన విలక్షణమైన నటన, హాస్య పంచులతో ప్రేక్షకులకు నవ్వులు పంచారు. ఆయన కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా.

ఇటీవల, టాలీవుడ్ లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం తన స్నేహితుడు ఎమ్మెస్ నారాయణను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. బ్రహ్మానందం తన దశాబ్దాల సినీ ప్రయాణంలో 1200కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్లతో ఎంతోమందిని ఆకట్టుకున్న బ్రహ్మానందం, అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.
తాజాగా బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్‌తో కలిసి నటించిన బ్రహ్మా ఆనందం సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఎమ్మెస్ నారాయణ చివరి రోజులు – బ్రహ్మానందం ఎమోషనల్
ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ – “తన చివరి రోజుల్లో ఎమ్మెస్ నారాయణ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని తెల్ల కాగితం మీద రాసి ఇచ్చారట కదా?” అని యాంకర్ అడగ్గా, బ్రహ్మానందం స్పందిస్తూ,
“నేను సంపాదించుకున్న నిజమైన సంపద ఇదే. ఒక వ్యక్తి తన చివరి దశలో ఎంతోమందిని గుర్తు చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, స్నేహితులు, రక్తసంబంధాలు – ఎంతోమంది ఉంటారు. కానీ, అలాంటి క్లిష్ట సమయంలో నన్ను చూడాలని అనుకోవడం నా జీవితంలో గొప్ప అనుభూతి. ఆయన మాట్లాడలేని స్థితిలో తన కూతురుతో తెల్ల కాగితంపై ‘బ్రహ్మానందం అన్నయ్యను చూడాలి’ అని రాయించి పంపించారు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో నేను శంషాబాద్ దగ్గర షూటింగ్‌లో ఉన్నాను. నేను దర్శకుడిని అడిగి వెళ్లాలని అనుకున్నా, కానీ నో అంటారేమో అనుకుని అలాగే కారెక్కి వెళ్లిపోయాను.”
బ్రహ్మానందం మాట్లాడుతూ,
“ఆసుపత్రికి వెళ్లగానే ఎమ్మెస్ నారాయణ నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను వెళ్ళగానే తన చేయి గట్టిగా పట్టుకుని వదిలేశారు. ఆ సన్నివేశాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నా రక్తసంబంధం కాదు, కానీ ఓ ఎమోషనల్ బాండ్ ఉంది. అద్భుతమైన మేధావి, అద్భితమైన హాస్యనటుడు అయిన ఎమ్మెస్ నారాయణను అంత చిన్న వయసులో కోల్పోవడం నేను జీర్ణించుకోలేకపోయాను.”
ఎమ్మెస్ నారాయణ – తెలుగు హాస్య ప్రపంచంలో చిరస్మరణీయం
ఎమ్మెస్ నారాయణ కామెడీ డైలాగ్స్, పంచులు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. బ్రహ్మానందం తన స్నేహితుడి మరణాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాడు. సినీ పరిశ్రమలో ఎమ్మెస్ నారాయణ ఒక హాస్యరాజు మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా. ఆయన ప్రస్థానం తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.