భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, ప్రధాని మోదీపై ప్రశంసలు
భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీని తన అన్నయ్య, గురువు లాంటి వారిగా అభివర్ణిస్తూ, ఆయన నాయకత్వంలో భారతదేశం సాధించిన అభివృద్ధిని కొనియాడారు. న్యూఢిల్లీలో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కంక్లేవ్‌లో టోబ్గే మాట్లాడుతూ, భారత్-భూటాన్ మధ్య బలమైన ఆధ్యాత్మిక బంధం ఉందని, ముఖ్యంగా బోధిసత్వుల పట్ల ఇద్దరు దేశాలకూ ఉన్న గౌరవాన్ని గుర్తుచేశారు.

టోబ్గే మాట్లాడుతూ, “ప్రధాని మోదీ తన తెలివితేటలు, ధైర్యసాహసాలు, కరుణతో కేవలం పదేళ్లలోనే భారత్‌ను ప్రగతి పథంలో నడిపించారు. ఆయన నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ఎదిగి, పేదరికం నుంచి కోట్లాది మంది బయటపడ్డారు” అని అన్నారు.
మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, వీటి ద్వారా భారతదేశం వికసిత్ భారత్‌గా మారుతోందని తెలిపారు. “నాయకత్వం అంటే కేవలం పదవులు కాదు, అది దార్శనికత, ధైర్యం, మార్పును ప్రేరేపించే సామర్థ్యం” అని స్పష్టం చేశారు.
భూటాన్ అభివృద్ధిలో భారతదేశ సహకారం ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్ట్‌లో భారతీయులు పాల్గొనాలని ఆయన కోరారు. భూటాన్ ప్రజా సేవ పరివర్తనలో ప్రధాని మోదీ వ్యక్తిగత మార్గదర్శకత్వం కావాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు, టోబ్గే తన ప్రసంగాన్ని “జై హింద్” అంటూ ముగించారు. అనంతరం మోదీ, టోబ్గే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. తన ప్రసంగంలో మోదీ కూడా టోబ్గేను తన సోదరుడిగా అభివర్ణించారు.