భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ చేసే తొలి ప్రసంగం కావడం విశేషం.

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (PoK) ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా దాడులు నిర్వహించాయి.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, మే 10న అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భూమి, వాయు, సముద్ర మార్గాల్లో అన్ని రకాల సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన చర్యలు, సరిహద్దుల్లో శాంతి స్థాపన, భద్రతా పరిస్థితులపై ప్రజలకు వివరించనున్నారు. అలాగే, పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రసంగం దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది.