భారీ భూకంపం బెంబేలెత్తించింది. క్షణాల్లో విధ్వంసం సృష్టించి పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించగా, మొదట 7.7 తీవ్రత, రెండోసారి 6.4 తీవ్రత నమోదైంది. భూకంప ప్రభావంతో అపార్టుమెంట్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు పేకమేడలా కూలిపోయాయి. మయన్మార్ ఎయిర్‌పోర్ట్ కూడా షేక్ అయ్యింది. స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో వందలాది మంది ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో విమానాలు, ఎయిర్‌పోర్టు బయట ఉన్న కార్లు కూడా ఊగిపోయాయి. మయన్మార్‌లో ఉన్న ప్రాచీన అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది. దేశ రాజధాని నేపిడాలోని వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.

థాయిలాండ్ భూకంప తీవ్రత
థాయిలాండ్‌పై కూడా భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. వందలాది బౌద్ధ రామాలు ధ్వంసమయ్యాయి. 20 నుంచి 30 అంతస్తుల భవనాలు కూలిపోయాయి. భూకంపం కారణంగా బ్యాంకాక్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. మెట్రో రైళ్లు ఊగిపోవడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు.
భారతదేశంతో పాటు పలు దేశాల్లో ప్రభావం
భూకంప ప్రభావం చైనా, లావోస్, బంగ్లాదేశ్‌తో పాటు భారతదేశంలోనూ కనిపించింది. కోల్‌కతా, మేఘాలయ, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు జనాలను వణికించాయి. ఇంఫాల్ ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. మేఘాలయలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

భూకంప నిరోధక భవనాలు – భవిష్యత్తు రక్షణ
బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనాలతో పాటు కొన్ని భవనాలు కూలిపోగా, మరికొన్ని ఊగిపోయాయి కానీ చెక్కుచెదరకుండా నిలిచాయి. భవనాల భూకంప నిరోధకతలో నిర్మాణ శైలి, వాడిన పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉక్కు, కలప వంటి పదార్థాలతో నిర్మించిన భవనాలు భూకంప ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇంజనీర్లు ఆధునిక భూకంప నిరోధక డిజైన్‌లను రూపొందించడంతో భవనాలపై భూకంప ప్రభావం తగ్గుతోంది.
బేస్ ఐసోలేటర్లు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భవనాలు భూకంపాన్ని తట్టుకోగలుగుతున్నాయి. బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు ఊగిపోయినా, అవి కూలిపోకుండా నిలవడం ఆధునిక ఇంజనీరింగ్ యొక్క విజయాన్ని రుజువు చేస్తోంది.