గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఈ వార్త పట్ల సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు.
హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బాలకృష్ణను వ్యక్తిగతంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ చేసిన సేవలకు పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గొప్పదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వండి:
బాలకృష్ణ మాట్లాడుతూ, “ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఎన్టీఆర్ నాకు తండ్రి మాత్రమే కాదు, నాకు గురువు కూడా. ఈ అవార్డు నాలో మరింత స్ఫూర్తిని నింపుతుంది. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని నా విన్నపం. ఇది నా ఒక్కడి కోరిక కాదు, తెలుగు ప్రజలందరి కోరిక. పద్మభూషణ్‌ను బిరుదుగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నాను. మేం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. నా అభిమానులు కూడా నా సినిమాలు, మంచి పనులే ఆశిస్తున్నారు. ఈ అవార్డు మరింత ప్రోత్సాహం ఇస్తుంది” అని పేర్కొన్నారు.