ఈ రోజుల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. దానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇది కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు మనల్ని ఆలోచించేలా చేస్తుంది. నేటి డిజిటల్ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)మనం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఉద్యోగం కనుగొనడం నుండి సివీలు, కవర్ లెటర్లు రాయడం వరకు ఏఐ ప్రతి రంగంలోనూ ప్రజలకు సహాయం చేస్తోంది.

ఇటీవల ఒక వ్యక్తి రాత్రి పడుకునేముందు 1,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏఐని ఉపయోగించాడు. సమాధానం చూసి తెగ ఆశ్చర్యపోయాడు. అతను లేచి చూసేసరికి అప్పటికే అతనికి 50 కి పైగా కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఆ కుర్రాడు రెడ్డిట్‌లోని ‘గెట్ ఎంప్లాయిడ్’ ఫోరమ్‌లో తన కథనాన్ని పంచుకుంటూ, తాను ఏఐ బాట్‌ను ఉపయోగించానని చెప్పాడు. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను రూపొందించిన బాట్ రాత్రంతా పనిచేసింది. ఒక నెలలో దాదాపు 50 ఇంటర్వ్యూ కాల్స్ అందుకునేందుకు సహాయపడిందని ఆ యువకుడు రాశాడు. అతను రూపొందించిన బాట్ పూర్తిగా ఆటోమేటెడ్. ఉద్యోగ వివరణ ఆధారంగా సీవీలు, కవర్ లెటర్‌లను సృష్టిస్తుంది. ఇది ఆటోమేటెడ్ స్క్రీనింగ్ సిస్టమ్‌లను పాస్ చేయడాన్ని సులభతరం చేయడమే కాకుండా, నియామక నిర్వాహకుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. అని ఆయన తెలిపాడు.
ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియలో మానవీయ కోణాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని పలువురు అంటున్నారు. కాగా ఈ ఉదంతం ఏఐకి పెరుగుతున్న పాత్రను హైలైట్ చేయడమే కాకుండా, ఉద్యోగ శోధన ప్రక్రియలో సాంకేతికత ఎలా విప్లవాత్మక మార్పులు చేసిందో కూడా తెలియజేస్తుంది. అయితే, ఆటోమేషన్ మానవ భావోద్వేగాలు, సంబంధాల ప్రాముఖ్యతను తగ్గిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.