ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన తర్వాత, తాజాగా మరో 38 మార్కెట్ కమిటీలకు కూడా ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది.

ఈ 38 కమిటీలకు కొత్త ఛైర్మన్లలో, 31 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు, 6 మంది జనసేనకు చెందినవారు, 1 వ్యక్తి బీజేపీ తరఫున ఉన్నారు. ఈ నియామకాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలిన కమిటీలకు త్వరలోనే ఛైర్మన్ల నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గతంలో నియమించిన 47 కమిటీలకు కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం జరిగింది. ఇందులో టీడీపీకి చెందిన 37 మందికి, జనసేనకు చెందిన 8 మందికి, బీజేపీకి చెందిన 2 మందికి ఛైర్మన్ పదవులు దక్కాయి.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించి కూటమిలోని మూడూ పార్టీల నాయకులు ప్రజాభిప్రాయాలను సేకరించి, సామాజిక మరియు ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను తుది జాబితాలో ఎంపిక చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం, ఎన్నో నెలల పాటు కసరత్తు చేసి ఈ జాబితాను విడుదల చేసింది.
కేవలం టీడీపీ నుంచే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన మార్కెట్ కమిటీల నియామకాలపై కూడా ప్రభుత్వం లోపల చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన కమిటీల ఛైర్మన్లను కూడా ప్రకటించనున్నారు.














