ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి మరియు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య పాలన, అభివృద్ధి అంశాలపై తీవ్ర వాదప్రతివాదం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ హయాంలో చేపట్టిన పథకాల గురించి ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యంగా, వైసీపీ హయాంలో అభివృద్ధిపై చర్చించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విశాఖ రుషికొండ భవనాల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అమరావతిలో తాత్కాలిక భవనాల కోసం భారీగా ప్రభుత్వ ఖజానా ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇస్తూ, విశాఖ రుషికొండ భవనాలకు ప్రజా ధనం దుర్వినియోగం జరగలేదా అని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే, దానిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.
మంత్రి అచ్చెన్నాయుడు సమాధానంగా, తమ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేయదని, గత వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయ భవనాలు తాత్కాలికం కాదని, అవి శాశ్వత భవనాలేనని స్పష్టం చేశారు.