ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న “ఆపరేషన్ సింధూర్”కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించింది.

పురపాలక సంస్థలలో అభివృద్ధికి సంబంధించి అమృత్-2.0 కింద 281 పనులను కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (CHAM) ద్వారా చేపట్టేందుకు ఆమోదం లభించింది.
జలవనరుల శాఖలో “జలహారతి కార్పొరేషన్” పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కర్నూలు జిల్లా బి.తండ్రపాడు వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు LNG HUB స్థాపనకు భూమి కేటాయించారు. నెల్లూరు జిల్లాలో భూ సేకరణకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారాన్ని నిర్ణయించారు.
టీటీడీ ఐటి విభాగంలో డీజీఎం (ఐటి)ని జీఎం (ఐటి)గా పదోన్నతి ఇచ్చారు. పర్యాటక రంగంలో ఉపాధి కల్పనకు ప్రోత్సాహక విధానానికి ఆమోదం లభించింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు తెలిపారు.