కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల తనపై నమోదైన రెండు కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఆమెను పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్యామల విచారణకు హాజరై, దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అంతేగాక, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.

ఇప్పుడు అదే మార్గంలో యాంకర్ విష్ణుప్రియ నడుస్తోంది. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు, శ్యామల కేసులో ఇచ్చిన ఆదేశాలనే విష్ణుప్రియకు వర్తింపచేసింది. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది.
ఈ విచారణలో భాగంగా, రెండు కేసులను ఒక్కటిగా పరిగణించి వాటిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే S.I.T బృందానికి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపాడు.