అమరావతి రాజధాని పునఃప్రారంభానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగనున్నాయి. మొత్తం రూ. 1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

రేపు జరిగే కార్యక్రమంలో ప్రధానంగా హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, కేంద్ర సేవల అధికారుల నివాస సముదాయాలకు శంకుస్థాపన జరుగుతుంది. దీనితో పాటు డీఆర్డీవో, NHAI, రైల్వే, DPIIT శాఖల పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా నాగాయలంకలో రూ.1500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు ఇది శ్రీకారం.
వేదికపై మొత్తం 14 మంది కూర్చోనున్న ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. మోదీ హెలిపాడ్ నుండి కారులో వేదిక వద్దకు చేరుకుని సభకు హాజరుకానున్నారు. సభ ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించారు.
అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయగా, మహిళలను పెద్దఎత్తున సభకు ఆహ్వానించేందుకు CRDA ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి మహిళలను ఆహ్వానించడమో విశేషం. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రధాని వేదికపైకి రాగానే ‘అమరావతి రీస్టార్ట్ పైలాన్’ ఆవిష్కరించనున్నారు. A అక్షర ఆకారంలో నిర్మించిన 21 అడుగుల గ్రానైట్ పైలాన్ ఇది. ఇది రాజధాని పునాది ప్రకటనగా గుర్తింపు పొందనుంది.