ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి సంబంధిత అనేక కీలక అంశాలపై చర్చించనుంది. పాలనకు పారదర్శకత, వేగం తీసుకురావడమే కాకుండా, గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ మళ్లీ ప్రారంభించాలనే సంకల్పంతో ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఫేజ్ 2 భూసేకరణ అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఆర్డీయే (CRDA) 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి, సీఆర్డీయే కమిషనర్‌కు ఆ అధికారాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే, ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీకి సంబంధించి CRDA చేసిన ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశముంది.
కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి టెండర్ల ఆమోదం కూడా ఈ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, 5వ SIPB సమావేశంలో ఆమోదించిన రూ.30,667 కోట్ల పెట్టుబడులు మరియు 32,133 ఉద్యోగాల కల్పనపై కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూములు కేటాయించడంపై చర్చ జరగనుంది.
ఈ కేబినెట్ సమావేశం ద్వారా రాష్ట్ర పాలనకు వేగం తెచ్చేలా, అభివృద్ధి పనులకు పునాది వేసేలా చంద్రబాబు నాయకత్వం చూపబోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమరావతి ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించేందుకు, రైతులకు న్యాయం చేయడానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ భేటీ కీలకంగా మారనుంది.