అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక అమ్మాయి ఎదను పట్టుకోవడం, పైజామా నాడాను లాగడం అత్యాచార యత్నం కింద పరిగణించలేమని కోర్టు వెల్లడించింది. అలాగే, దీనిని పోక్సో చట్టం ప్రకారం తీవ్ర లైంగిక దాడిగా చూడకూడదని తీర్పునిచ్చింది. అత్యాచార యత్నంలో తొలి దశ (ఇంటెన్షన్) మరియు అక్కడ నిజంగా జరిగిన సంఘటన మధ్య తేడా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితులు అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించారని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాలు లేవని కోర్టు తెలిపింది. అయితే, నిందితులను తీవ్ర లైంగికదాడి కేసులో విచారించాలని ఆదేశించింది.

2021లో జరిగిన ఈ కేసులో 11 ఏళ్ల బాలికపై పవన్, ఆకాష్ అనే వ్యక్తులు లైంగిక దాడి చేయాలని యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిఫ్ట్ ఇస్తామని చెప్పి, బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా ఆమెను కల్వర్ట్ కిందకు లాగే ప్రయత్నం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, స్థానికుల మద్దతుతో ఆ బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం, దీనినిAttempted Rapeగా పరిగణించలేమని పేర్కొంది. ఈ చర్యల వల్ల బాధితురాలు పూర్తిగా వివస్త్రగా మారలేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పుపై మహిళా సంఘాలు, న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఛాతీని పట్టుకోవడం లైంగికదాడి కాదా? పైజామా నాడాను లాగడంAttempted Rape కింద రాదా? అని ప్రశ్నిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద తీర్పు భవిష్యత్తులో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.












