తల అజిత్ కుమార్ తమిళ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్లలో ఒకరు. 1990లో ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అజిత్, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళలు, యువతలో విశేషమైన అభిమానాన్ని సంపాదించారు. నటనతోపాటు, స్టయిల్, వ్యక్తిత్వం కలిపి ఆయనను స్టార్‌గా నిలబెట్టాయి. అజిత్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.105 నుండి రూ.165 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డు అందించింది.

నటుడిగానే కాకుండా అజిత్ ఒక ప్రొఫెషనల్ కార్ రేసర్. కార్లు, బైకులు అంటే విపరీతమైన ప్రేమ. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో రూ.12-15 కోట్ల విలువైన సముద్రతీర బంగ్లాలో ఆయన నివసిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, హైటెక్ జిమ్ వంటి సౌకర్యాలున్నాయి. 1999లో ‘అమర్కాలం’ షూటింగ్ సమయంలో హీరోయిన్ షాలినిని ప్రేమించి, 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు – అద్విక్, అనౌష్క ఉన్నారు.

అజిత్ సొంతంగా రూ.25 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నారు. ఆయన వద్ద BMW S1000 RR, అప్రిలియా కాపోనార్డ్, BMW K1300 S వంటి హైఎండ్ బైకులు ఉన్నాయి. వీటి ధర రూ.10-15 లక్షల మధ్య ఉంటుంది. కార్లలో ఆయన కలెక్షన్ అద్భుతం. లంబోర్గిని, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కలిపి రూ.36 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కలవు. మొత్తం ఆస్తుల విలువ రూ.350 కోట్లు. ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అరుదైన స్టార్ కూడా అజిత్‌నే.