టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్‌కు సంబంధించి మహేష్ బాబు రూ.5.90 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని ఈడీ అధికారులు గుర్తించారు. అందులో రూ.3.4 కోట్లను నగదు రూపంలో, మిగిలిన రూ.2.5 కోట్లను RTGS ద్వారా పొందారని ఆధారాలు ఉన్నట్లు తెలిసింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఏప్రిల్ 22న మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 28న బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆ రోజు విచారణకు రాలేకపోయారని మహేష్ బాబు లేఖ ద్వారా ఈడీకి సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు మరోసారి మహేష్ బాబును విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారు. అయితే మహేష్ బాబు నిజంగా హాజరవుతారా? లేదా మరోసారి వాయిదా కోరుతారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ కేసు సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ విచారణపై మిగతా అభియోగాలు మరియు ఇతర నటుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.