పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మిస్సైల్ దాడులు చేపట్టింది. పాక్ ప్రజలకు, సైనికులకు హానికరం కాకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసింది. అయినా పాక్ ప్రతీకారం పేరుతో ఇండియాపై క్షిపణి దాడులు చేస్తున్నది. ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్‌తో భారత్ ఇప్పటికే కొన్ని దాడులను అడ్డుకుంది. అయితే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎయిర్ ఫోర్స్ మానవ సహిత అంతరిక్ష ప్రయాణం గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను తిరిగి డ్యూటీలోకి పిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొంటున్న ఆయన, “ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐఏఎఫ్ నన్ను తిరిగి పిలిచింది” అని వెల్లడించారు. ఆయన త్వరలో తిరిగి ఎయిర్ ఫోర్స్‌లో చేరనున్నారు.
కృష్ణన్ 2003లో ఎయిర్ ఫోర్స్‌లో చేరి, సుమారు 2,900 గంటల ఫ్లయింగ్ అనుభవం సంపాదించారు. Su-30 MKI, MiG-21, Jaguar, An-32 వంటి ఫైటర్ జెట్లను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ అనుభవం ఇప్పుడు దేశానికి అవసరం అయినందున ఆయన్ను మళ్లీ యాక్టివ్ డ్యూటీలోకి రప్పించారు.