ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి అనుకున్న తరుణంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండల వేడి తగ్గకముందే ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని తెలిపింది.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకూ తక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది. మే 08 (గురువారం) నాటి కోసం తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీనితో పాటు ఈదురుగాలులు, పిడుగుల సూచనలు కూడా ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు ఉష్ణోగ్రతలు 40°C నుంచి 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్లుండి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.