దేశవ్యాప్తంగా యుద్ధ సన్నాహకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ అభ్యాస్” పేరిట 244 ప్రాంతాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఇది 54 ఏళ్ల తర్వాత జరగడం విశేషం. 1962లో భారత్-చైనా, 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధాల తరువాత ఇదే స్థాయిలో డ్రిల్స్ జరగడం ఇదే మొదటిసారి.

హైదరాబాద్‌లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలి NFC ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టారు. పోలీసు, ఫైర్, రెవెన్యూ, వైద్య విభాగాలు, SDRF అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.
విశాఖపట్నంలో నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్‌తో కలిసి రెండు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎయిర్ రెయిడ్ సైరన్ వినిపించగానే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం, ఇంటి విద్యుత్ పరికరాలు ఆపేయడం, చెవులు మూసుకుని తల దాచుకోవడం వంటి ప్రాథమిక నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ డ్రిల్స్ ద్వారా గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. వాయుసేనతో హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ సద్వినియోగం, షాడో కంట్రోల్ రూమ్‌ల పనితీరును కూడా పరిశీలించారు.
పోలీసులు ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని, డ్రిల్స్ కేవలం అవగాహన కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. 1979లో స్కైలాబ్ కేసులో లేనిపోని అపోహలతో ప్రజలు భయపడిన ఘటనను గుర్తు చేశారు. అందువల్ల ప్రజలు శాంతంగా ఉండాలని, అవగాహనతో సహకరించాలని సూచించారు.