ఉగ్రవాదంపై భారత్ మరోసారి మెరుపుదాడి చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. భారత ఆర్మీ అర్ధరాత్రి 1:28కు దాడికి సిద్ధమై, 1:51కి ఆపరేషన్ ముగించి “జైహింద్” అంటూ విజయాన్ని ప్రకటించింది.

ఈ మెరుపుదాడిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్‌రూమ్ నుంచి పర్యవేక్షించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించి, “జైహింద్” అంటూ ట్వీట్ చేశారు. ఈ దాడిలో లష్కరే తోయిబా ఉగ్రనేత హఫీజ్ అబ్దుల్ మాలిక్, మరో ఉగ్రవాది ముదాసిర్ మృతి చెందారు.
భారత ఆర్మీ దాడుల తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగింది. పాక్ సైన్యం భారత చెక్‌పోస్టులపై కాల్పులు జరిపింది. 10 మంది పౌరులు మృతిచెందగా, పలు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ రేంజర్లు యూరీ, కుప్వారా, రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఆపరేషన్ పై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, “ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిందే” అన్నారు. ‘అబీ పిక్చర్ బాకీ హై’ అంటూ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడప్పుడే ఆగదు. భారత ప్రతీకార ధాటికి ఉగ్రవాద శక్తులు తుడిచిపెట్టబడే వరకు కొనసాగుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.