తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సరళమైన కానీ గంభీరమైన హెచ్చరిక ఇచ్చారు. ‘‘తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా?’’ అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ఆయన, ‘‘పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నా.. నెల మొదటి తేదీకే జీతాలిస్తున్నా’’ అని అన్నారు. అయినా సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తూ రోడ్డెక్కితే ఎలా? అని ఉద్యోగులను ప్రశ్నించారు.

ప్రస్తుతం తనకు ముఖ్యమంత్రి హోదా ఉన్నా, దుబారా ఖర్చులకు దూరంగా ఉన్నట్టు రేవంత్ తెలిపారు. “స్పెషల్ ఫ్లైట్స్ వాడొచ్చు.. కానీ ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తున్నా. ఎందుకంటే ప్రజల సొమ్ము వృథా చేయకూడదనే బాధ్యత,” అన్నారు. ప్రతి కుటుంబం లెక్కలేసుకుని నడిచే విధంగానే తాను కూడా రాష్ట్ర ఖర్చులను తగ్గిస్తూ పాలన సాగిస్తున్నానని చెప్పారు.
ఉద్యోగులు సమ్మెలు, ధర్నాల మార్గాన్ని ఎంచుకుంటే ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. “ఇక నిర్ణయం మీ ఇష్టమే..” అంటూ ప్రభుత్వ తీరును సూటిగా చెప్పారు. ఉద్యోగులకిచ్చే జీతాలను ఆలస్యం చేయకుండా చెల్లించడాన్ని ప్రధాన బాధ్యతగా తీసుకుంటున్నానని తెలిపారు. చివరగా, “తెలంగాణ గౌరవంగా నిలవాలంటే అందరూ బాధ్యతతో వ్యవహరించాలి,” అని సూచించారు.