పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాడిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశ భద్రతతో చెలగాటం ఆడే వారిని క్షమించబోమని, దాడికి న్యాయం తప్పదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదులు, వారికి సహాయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ అసహనం వ్యక్తం చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలో అంగోలా అధ్యక్షుడు జోవో లౌరెంకోను కలిశారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో అంగోలా మద్దతు పలకడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. పహల్గామ్ దాడిని ఖండించినందుకు అంగోలాకు ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశం-అంగోలా మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలను ప్రధాని గుర్తు చేశారు. అంగోలా స్వాతంత్ర్య పోరాటానికి భారత్ ఇచ్చిన మద్దతు గురించి గుర్తు చేశారు. రెండు దేశాల దౌత్య సంబంధాలకు 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
మోదీ వ్యాఖ్యానిస్తూ, “ఉగ్రవాదం మానవాళికి అత్యంత ప్రమాదకరమైన ముప్పు. దీనిని ఎదిరించేందుకు అంతర్జాతీయ మద్దతు అవసరం. భారత్ దీని కోసం కట్టుబడి ఉంది” అని తెలిపారు.