తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఒకవైపు మాడిపోతున్న ఎండలు, మరోవైపు వర్షాలు ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో మే 7 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులతో పాటు గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని అంచనా. రాయలసీమలో కూడా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 7 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల పగలు ఎండలు, సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, దక్షిణ-నైరుతి గాలుల ప్రభావంతో వర్షాలు కొనసాగనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయ మార్పు లేకపోయినా తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.