తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న విజయ్ దళపతి, తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వినూత్న దిశలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ‘జననాయకన్’ అనే రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం విజయ్ కొడైకెనాల్ వెళ్తుండటంతో, ఆయన మధురై చేరుకోవాల్సి వచ్చింది. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ – “నేను జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్తున్నాను. దయచేసి నా కారును అనుసరించవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు” అంటూ అభిమానులను కోరారు.

అయినా ఆయన మధురై చేరుకోగానే వేలాది మంది అభిమానులు విమానాశ్రయంలోకి చేరుకొని పూల వర్షంతో విజయ్‌కు ఘన స్వాగతం పలికారు. వారు విజయ్ వాహనాన్ని చుట్టుముట్టారు. కొంతమంది ఆయన కారుపై ఎక్కేందుకు ప్రయత్నించగా, వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఇదివరకు కోయంబత్తూరులో బూత్ కమిటీ సెమినార్‌కు విజయ్ హాజరైనప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగింది. అభిమానులు బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల వివాదం రేగింది. విజయ్ ఈ చర్యలను ఖండిస్తూ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతి అడుగుపై అభిమానుల ఆసక్తి పెరిగింది.