ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న దంపతులు బుధవారం రాత్రి తమ్ముడు వివాహం ఉండడంతో సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తరలించారు.

అక్కడ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు ఇది సాధారణ గర్భధారణ కాదని, గర్భసంచి వెలుపల పేగు దగ్గర పిండం అభివృద్ధి చెందిందని, అది పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావమవుతోందని చెప్పారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రూ. 40,000 చెల్లించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయించారు.
ఆపరేషన్ అనంతరం గురువారం ఉదయం జ్యోత్స్న భర్తతో మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే మృతిచెందింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి జరిగిందని ఆరోపించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. వైద్యులు మాత్రం జ్యోత్స్న ఆసుపత్రికి చేరుకునే సమయానికే పరిస్థితి తీవ్రంగా ఉన్నదని, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకే ఆపరేషన్ చేశామని తెలిపారు. చివరకు కుటుంబసభ్యులతో రాజీ కుదిరినట్టు సమాచారం. మృతురాలికి ఇద్దరేళ్ల కుమార్తె ఉండటం మరింత కంటతడి పెట్టిస్తోంది.