నవ మాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ చేతిలోనే ఒక తల్లి ఇలా నిర్లక్ష్యానికి గురవుతుందని ఎవరు ఊహించగలరు? జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ కలచివేసింది. ఇస్లాంపురాలో నివాసముంటున్న వృద్ధురాలు బుధవ్వ తన కుమార్తె ఈశ్వరి కోసం జీవితమంతా కష్టపడింది. పెద్ద చేయడమే కాదు, తన చల్లని నీడగా ఉండాలని ఆశించింది. కానీ, కూతురు మాత్రం తల్లిపట్ల ప్రేమకంటే డబ్బునే ప్రాధాన్యతనిచ్చింది.

ఈశ్వరి కన్ను తల్లి వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. తల్లిని గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె సమీపంలోని అడవికి తీసుకెళ్లి బంగారం లాక్కొంది. ఆపై వృద్ధ తల్లిని అక్కడే వదిలేసి పరారైంది. తిండి, నీరు లేక రెండు రోజుల పాటు అక్కడే తిప్పలు పడిన బుధవ్వ అపస్మారక స్థితికి చేరుకుంది.
అటుగా వెళుతున్న యువకులు ఆమెను గమనించి అధికారులకు సమాచారం అందించడంతో, వెంటనే సఖి కేంద్రం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ సంఘటన తల్లిదండ్రుల పట్ల సానుభూతి ఉండే సమాజంలో తలవంచేలా చేస్తోంది. తల్లి అనేది దైవానికి సమానం. అలాంటి అమ్మను డబ్బు కోసం ఇలా చెరిపివేయడం అమానుషం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.