దేశం వ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్టు మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అధికార, విపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ గతంలో కులగణనను వ్యతిరేకించిందని, కేవలం సర్వేలకే పరిమితమైందని విమర్శించారు. 1931లో చివరిసారి కులగణన జరిగిందని, ఈసారి మాత్రం పారదర్శకంగా దేశవ్యాప్తంగా చేయనున్నట్టు తెలిపారు.

కులగణనపై పూర్తి మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ, తమ పోరాట ఫలితంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఈ విషయంలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. బిహార్ కులగణనతో పోలిస్తే తెలంగాణ మోడల్ మరింత సమగ్రంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కులగణనతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేకపోయిందని వారు ప్రశ్నిస్తున్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, తమ పార్టీ దశాబ్దాలుగా కులగణన కోసం పోరాడిందని, లలూ ప్రసాద్ యాదవ్ 2001లోనే దీనిపై డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బిహార్‌లో గతంలో జరిగిన కులగణనను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందని చెప్పారు.
ఈ మొత్తం విషయంలో… ఎవరి కృషికి క్రెడిట్ అనే రాజకీయం కొనసాగుతున్నా, దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, రాజకీయ అధికారంలో వాటసత్వానికి ఇది కీలక మలుపు కావొచ్చు.