తెలంగాణలో రాజకీయ గర్జనలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభలో కేసీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు. “అసెంబ్లీకి రాను, పిల్లలను పంపుతానని చెప్పే నేతకు ప్రతిపక్ష హోదా ఏంటి? సభకు రాని నాయకుడికి ప్రజల మీద ప్రశ్నించే హక్కే లేదు” అంటూ రేవంత్ మండిపడ్డారు.

కేసీఆర్ పథకాలు ఆగిపోయాయన్న ఆరోపణలపై కూడా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “ఒక్కటీ చెప్పండి… ఏ పథకం ఆగింది? ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నీ నడుస్తున్నాయి. కానీ మీరు మాత్రం ప్రజల దగ్గరకు రావడం లేదు” అంటూ విమర్శించారు.
“తాము పదేళ్లు అధికారంలో ఉంటాం… మీరు మాత్రం పదేళ్లు ఫామ్‌హౌస్ నుంచే బయటకు రాలేరు” అంటూ సవాల్ విసిరారు. “తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నావా? మీ పదేళ్ల పాలనలో ప్రజలకు ఉద్యోగాలే కాదు, కుటుంబ సభ్యులకు పదవులే ఇచ్చారు” అంటూ విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్రం కోసమే తాము మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ స్పష్టం చేశారు. “కాళేశ్వరం, మిషన్ భగీరథ సహా ఏదైనా పథకంపై ఓపెన్ డిబేట్‌కు సిద్ధం” అని చెప్పారు. కేసీఆర్ విషంతో మాట్లాడుతున్నారని, ఆయన మాటల్లో ప్రజల ప్రయోజనం కనిపించడంలేదని ఘాటుగా తెలిపారు.