ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద ఉన్న భక్తులపై భారీ గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీవ్ర వర్షాల కారణంగా ఊహించని ప్రమాదం జరిగిందని, జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదంపై మంత్రి స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు, ఎంపీ భరత్, అశోక్ గజపతి రాజుతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు పరిహారంగా ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.