ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ సినిమాల ద్వారా ఎంతో చేరువైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా, ఆమె పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు యజమానిగా క్రికెట్ ప్రపంచంలో చురుకుగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ నటి, తాజాగా ట్విట్టర్ (X) లో అభిమానులతో ఓ ఛాట్ సెషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చిన ప్రీతి జింటా, ఓ నెటిజన్ వేసిన రాజకీయ ప్రశ్నకు కాస్త తట్టుకోలేకపోయింది. “మీరు బీజేపీలో చేరతారా?” అనే ప్రశ్నపై ఆమె కాస్త అసహనం వ్యక్తం చేసింది. “ఇలాంటి ప్రశ్నలు సామాజిక మాధ్యమాల సమస్య. ఒక్కరు దేవాలయాలకు వెళ్లినా, దేశాన్ని గౌరవించినా రాజకీయంగా జడ్జ్ చేయడం మానండి. నా పిల్లలను భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాల ప్రకారం పెంచుతున్నా. ఈ విషయాల్లో నేను గర్వపడుతున్నా. విదేశాల్లో ఉన్నా నా దేశాన్ని మరచిపోలేను” అంటూ ఘాటుగా స్పందించింది.
అయితే, ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. “ఇంత చిన్న ప్రశ్నకు ఈ స్థాయిలో స్పందించాలా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరో అభిమాని అడిగిన “పంజాబ్ కింగ్స్ కాకుండా మీకు ఇష్టమైన జట్టు ఏది?” అనే ప్రశ్నకు, “నా భర్తను ప్రేమిస్తున్నాను కాబట్టి, ఎప్పటికీ పంజాబ్ కింగ్స్ నే నా జట్టు అనిపిస్తుంది” అంటూ పాజిటివ్ గా స్పందించింది.