ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా ట్రోల్ అయిన వారిలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో కూర్చున్న ద్రవిడ్ ప్రతి సారి కెమెరా చూపినప్పుడల్లా ఏదో మాట్లాడుతూనే కనిపించాడు. అయితే తాజాగా, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శతకం పూర్తిచేసిన సమయంలో, వీల్‌చైర్‌లో ఉన్న ద్రవిడ్ కూడా నిలబడి చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో 38 బంతుల్లో 11 సిక్సర్లు, 7 ఫోర్లు బాది 101 పరుగులు చేసిన వైభవ్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌కు 8 వికెట్ల విజయాన్ని అందించాడు. తన తొలి ఐపీఎల్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా, క్రిస్ గేల్ తర్వాత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అంతేకాదు, రషీద్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, కరీం జనత్ వంటి టాప్ బౌలర్లను ధ్వంసం చేశాడు. ప్రత్యేకంగా, 36 ఏళ్ల ఇషాంత్ శర్మపై ఒక ఓవర్‌లోనే 28 పరుగులు సాధించాడు. అలాగే తన తొలి మ్యాచ్ ఆడుతున్న కరీం జనత్ ఓ ఓవర్‌లో 30 పరుగులు ఇవ్వించి దెబ్బతిన్నాడు. వైభవ్ ఔటైనప్పుడు స్టేడియం మొత్తం అభినందనలతో మార్మోగింది.