హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో భర్తీ చేస్తున్న పోస్టుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షలు కూడా నిర్వహించగా, మరికొన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 22న సీబీటీ-2 పరీక్ష నిర్వహించారు. పరీక్ష అనంతరం ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యర్థులు రూ.50 చెల్లించి ఏప్రిల్ 30వ తేదీలోపు కీపై అభ్యంతరాలు వ్యక్తీకరించవచ్చని బోర్డు ప్రకటించింది. సరైన అభ్యంతరమైతే చెల్లించిన డబ్బు తిరిగి అందించనున్నారు.

అయితే తాజాగా ఆర్ఆర్బీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న నిర్వహించిన జేఈ సీబీటీ-2 పరీక్షలో, షిఫ్ట్-1 ప్రశ్నలు షిఫ్ట్-2లో పునరావృతమైనట్లు గుర్తించి, షిఫ్ట్-2 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగిందని వివరించింది. దేశ వ్యాప్తంగా 20,792 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరికి త్వరలోనే మరోసారి పరీక్ష నిర్వహించి, కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహణలో అధిక స్థాయిలో గోప్యత పాటిస్తూ, ప్రశ్నల సెట్టింగ్, ప్రాసెసింగ్, నిల్వ, ఎన్క్రిప్షన్ వంటి కార్యకలాపాలను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తోంది. అయినప్పటికీ సాఫ్ట్వేర్ లో వచ్చిన లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది.