ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగిన 43వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి పాలైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన CSK, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ చూసేందుకు పలువురు సినీతారలు కూడా స్టేడియానికి హాజరయ్యారు. ముఖ్యంగా చెన్నైకు మద్దతుగా మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా శ్రుతి హాసన్ హాజరైంది. కానీ చెన్నై ఓటమితో ఆమె చాలా భావోద్వేగానికి గురై, స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టింది. ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రుతితో పాటు నటుడు అజిత్ కుమార్ కూడా తన కుటుంబంతో మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే, చెన్నై జట్టు 154 పరుగులకే ఆలౌట్ కావడంతో నిరాశ నెలకొంది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 30 పరుగులు, అరంగేట్ర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులు చేసినా, కెప్టెన్ ధోని 10 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. SRH టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని, ఈ చిన్న లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే సాధించి ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెపాక్‌లో CSKపై విజయం సాధించింది. శ్రుతి హాసన్ కన్నీళ్లు పెట్టిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.