యువహీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ ఘనవిజయం సాధించి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ వాస్తవ సంఘటనల ఆధారిత చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సాయి పల్లవితో కలిసి చైతన్య నటనలో మెరిశాడు. ఇప్పుడు అతను మరో ఆసక్తికర మైథలాజికల్ థ్రిల్లర్‌లో కార్తీక్ దండు డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే చైతన్య ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. షోయు పేరుతో జపనీస్ రెస్టారెంట్ మొదలుపెట్టగా, అది మంచి స్పందన పొందింది. ఇటీవలే స్కూజీ అనే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మేము కస్టమర్లకు టేస్టీ ఫుడ్ అందించడమే లక్ష్యం,” అన్నాడు చైతన్య.
ఇందుకు తోడు ఎన్టీఆర్ చేసిన కామెంట్లు మరింత స్పాట్‌లైట్‌లోకి తీసుకువచ్చాయి. జపాన్‌లో దేవర సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని షోయు రెస్టారెంట్ బెస్ట్. నా ఫ్రెండ్ నాగచైతన్య ప్రారంభించినది. అక్కడ ఇండియాలో బెస్ట్ జపనీస్ ఫుడ్ దొరుకుతుంది,” అని ప్రశంసించాడు. దీనిపై చైతన్య స్పందిస్తూ, “తారక్ అలా చెప్పడం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది,” అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.