ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఎండీ తాజా హెచ్చరికల ప్రకారం, రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కనిష్టంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా 20కి పైగా జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, ఏపీలో శనివారం తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తలపై కప్పు, నీటి బాటిల్ వాడాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.