పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడులకు తెరలేపింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మళ్లీ కవ్మింపు చర్యలు చేపడుతున్నారు. దీనిపై భారత భద్రతా దళాలు గట్టిగా స్పందిస్తూ జమ్ము కశ్మీర్‌లో భారీగా సెర్చ్ ఆపరేషన్లను చేపట్టాయి. లోకల్ టెర్రరిస్టులపై కూడా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, భారత్ యాక్షన్‌లోకి దిగడంతో పాకిస్తాన్ భయాందోళనకు గురవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుటుంబంతో పాటు పలువురు ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా విదేశాలకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. వీరిని బ్రిటన్, అమెరికాలకు పంపినట్టు సమాచారం.
ఈ దాడి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పాకిస్థాన్‌పై చర్యలు ముమ్మరం చేసింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి సరిహద్దు రాకపోకలు నిలిపివేసింది. పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసి, 48 గంటల్లో దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది.
హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి, గడువు తర్వాత ఒక్క పాకిస్తానీ కూడా దేశంలో ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. పాక్ ఆర్మీ ఒకవైపు ధైర్యంగా ఉన్నట్టు చూపిస్తూనే, మరోవైపు కుటుంబాలను సేఫ్ జోన్లకు తరలించటం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.