థైరాయిడ్ సమస్యలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే జబ్బులలో ఒకటి. ఇది మెడలో ఉన్న థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే మార్పుల వల్ల కలిగే సమస్య. ఈ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియను నియంత్రిస్తాయి. కానీ ఇవి సమతుల్యంలో లేకపోతే, అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

హైపోథైరాయిడిజం అనగా హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం. దీని కారణంగా అలసట, బలహీనత, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, మలబద్ధకం, చలికి అధిక సున్నితత్వం, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో ఋతు చక్రంలో అవకతవకలు కూడా దీనివల్ల ఏర్పడతాయి.
హైపర్‌థైరాయిడిజంలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, అధిక గుండె వేగం, చెమటలు, వేడి పట్ల అసహనం, చేతుల వణుకు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెడ భాగంలో వాపు ఏర్పడుతుంది, దీనిని గాయిటర్ అంటారు.
అలాగే కొన్ని అరుదైన లక్షణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ముఖంలో వాపు, గొంతులో అసౌకర్యం, స్వరంలో మార్పులు, కండర నొప్పులు, జ్ఞాపకశక్తి లోపం, ఏకాగ్రత సమస్యలు ఇవన్నీ థైరాయిడ్ రుగ్మతలకు సంకేతాలు కావచ్చు.
థైరాయిడ్ సమస్యలకు ప్రధానంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ అనే ఆటోఇమ్యూన్ రుగ్మత, అయోడిన్ లోపం, కొన్ని మందులు, లేదా తీరని ఒత్తిడి కారణం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో, 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా ఈ సమస్యలు కనిపిస్తాయి.
థైరాయిడ్ సమస్యను నిర్ధారించేందుకు TSH, T3, T4 అనే రక్తపరీక్షలు చేస్తారు. హైపోథైరాయిడిజం ఉన్నవారికి లెవోథైరాక్సిన్ అనే హార్మోన్ రీప్లేస్‌మెంట్ మందులు సూచిస్తారు. హైపర్‌థైరాయిడిజానికి యాంటీ థైరాయిడ్ మందులు, రెడియోధెరపీ లేదా సర్జరీ కూడా సూచించబడవచ్చు.
ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అలసట, బరువు మార్పులు, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. మొదటిదశలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే, థైరాయిడ్ సమస్యల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.