తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీ నటులు చేసిన యాడ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసి, సిట్ విచారణకు ఆదేశించారు.

ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ఈ యాప్స్ ప్రకటనలపై అడ్వకేట్ నాగూర్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మెట్రోలో రోజూ 5 లక్షల మంది ప్రయాణిస్తుంటే, ఇలా ప్రమోషన్లు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. మెట్రో బోర్డు డైరెక్టర్లలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నప్పటికీ వీరు ఈ ప్రకటనలను ఎలా ఆమోదించారనే అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అలాగే ఈడీ దర్యాప్తునూ కోరారు.
హైదరాబాద్ మెట్రో రైలు తరఫు న్యాయవాది 2022 తర్వాత ఎటువంటి బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శించలేదని కోర్టుకు తెలిపారు. సమగ్ర కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరగా, హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.