హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశంలోని 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు ఏప్రిల్ 23 నుంచి మే 2, 2025 వరకు అందుబాటులో ఉంటాయి.

జేఈఈ మెయిన్ 2025 రెండు విడతల్లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు రూ.1600 కాగా, ఇతరులకి రూ.3200.
అడ్మిట్ కార్డులు మే 11 నుంచి 18 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 18న జరుగుతుంది – పేపర్ 1 ఉదయం 9:00 నుండి 12:00 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ ద్వారా అర్హత పొందిన 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ రాయవచ్చు. మెయిన్‌కు దేశవ్యాప్తంగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేయగా, 14.75 లక్షల మంది పరీక్ష రాశారు.
అదేవిధంగా NITలు, ట్రిపుల్‌ఐటీలు, GFTIల్లో ప్రవేశాలకూ వీరు పోటీ పడొచ్చు. ఐఐటీలో చేరాలంటే మాత్రం అడ్వాన్స్‌డ్ తప్పనిసరి. ఫలితాలు జూన్ 2న విడుదలవుతాయి.
ఈ ఏడాది ఐఐటీల్లో 17,695 B.Tech మరియు B.Sc సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఆర్క్ కోర్సులకు ఆశించేవారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) కూడా రాయాలి, ఇది జూన్ 5న జరుగుతుంది.