ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. నటించాల్సిన పాత్రలు మాత్రమే మిగిలి ఉండటంతో, నిర్మాతలు పవన్ డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ దానయ్యలతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌లు త్వరలోనే పూర్తి చేస్తానని వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. వచ్చే నెలలో రిలీజ్‌కు గాను షూటింగ్‌ను వేగంగా ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా ముందు మొదలైన ఈ చిత్రం అనేకసార్లు వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న “ఓజీ” సినిమాల షూటింగ్‌లను జులై నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశమూ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.