జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూతన వరుడు శుభం ద్వివేది కూడా మరణించాడు. శుభం ఫిబ్రవరి 12, 2025న పెళ్లి చేసుకుని, భార్యతో కలిసి హనీమూన్ కోసం కాశ్మీర్‌కు వెళ్లాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే అతని జీవితం అర్థాంతరంగా ముగిసింది. శుభం భార్య హనీమూన్‌ను ఒక పీడకలలా అనుభవించాల్సి వచ్చింది.

ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభం బంధువు సౌరభ్ ద్వివేది మాట్లాడుతూ — ఉగ్రవాదులు వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాతే కాల్పులు ప్రారంభించారని తెలిపారు. శుభాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి, అతని తలపై నేరుగా కాల్చారని ఆరోపించారు. దాడి జరిగిన వెంటనే శుభం భార్య తన మామకు ఫోన్ చేసి శుభం మరణాన్ని తెలియజేసింది. పర్యాటకుల పేర్లు అడిగి ఖచ్చితంగా టార్గెట్ చేసినట్లు ఆమె తెలిపిందని తెలిపారు.
ఈ దాడిలో మహారాష్ట్రకు చెందిన న్యూ పన్వేల్ నివాసి దిలీప్ దేసాలే, నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (కర్నాల్), అకౌంట్స్ ఆఫీసర్ ప్రశాంత్ సత్పతి (ఒడిశా), శైలేష్ కడాటియా (సూరత్) వంటి పలువురు మృతి చెందారు. ప్రశాంత్ భార్య, చిన్న కొడుకు గురించి ఇంకా సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా, పెరూ పర్యటనలను రద్దు చేసుకున్నారు. భారత్‌కు చేరిన ప్రధాని మోదీ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.