తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సెలవు రోజులలో, పర్వదినాల సమయంలో భక్తుల సంఖ్య 90 వేల దాకా పెరుగుతోంది. ఈ తరహాలో భారీగా వాహనాలు తిరుమల ఘాట్ రోడ్‌పై పోవడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ పై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఈ సమస్యలకు పరిష్కారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 2047 విజన్‌లో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తిరుమలలో వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో భవిష్యత్తులో ఎక్కువ భక్తులకు వసతి కల్పించడం అసాధ్యమవుతుందని భావించిన టీటీడీ, భక్తులను కొండపైకి నేరుగా అనుమతించకుండా, ముందుగా అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ బేస్ క్యాంప్ 15 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. గతంలో వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్ స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో, అదే స్థలాన్ని బేస్ క్యాంప్‌కు ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది. రోజూ సుమారు 10,000 వాహనాలు తిరుమల కొండకు వెళ్తున్న నేపథ్యంలో, భక్తుల ప్రవేశాన్ని అలిపిరి వద్ద నియంత్రించి, అక్కడ నుంచే గైడ్ చేసి పంపించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇది వాహనాల శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, తిరుమలలోని గ్రీన్ కవర్‌ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో తిరుమలలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించడం కష్టమని, తద్వారా చెట్లను నరకడం తప్పదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అలిపిరిలో నిర్మించనున్న బేస్ క్యాంప్ ద్వారా దాదాపు 25,000 మంది భక్తులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇది భక్తులకు మేలు చేసే మార్గమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా శుభ సూచకంగా నిలవనుంది.