నజ్రియా నజీమ్.. మలయాళంలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమాతోనే అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే సుందరానికి’ సినిమాలో నటించిన నజ్రియా తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయింది. ఆ తరవాత తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అలాగే నజ్రియా మొదట ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం కాగా, 2014లో ‘బెంగుళూరు డేస్’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఫహద్ ఫాజిల్ ఆమె భర్తగా నటించగా.. అదే సినిమాలో పరిచయమైన ఈ జంట నిజ జీవితంలో ప్రేమలో పడి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నజ్రియా మలయాళ సినిమాల్లో కొనసాగుతుండగా, ఫహద్ ఫాజిల్ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, ముఖ్యంగా ‘పుష్ప 2’తో.

ఇక తాజాగా నజ్రియా గురించి మరో షాక్ ఇచ్చే విషయం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఆమె సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా లేకపోవడం అభిమానులను కలవరపెట్టింది. ఇటీవల ‘సూక్ష్మదర్శిని’ అనే సినిమా చేసింది, అది హిట్ కూడా అయ్యింది. కానీ ఆ తరువాత ఆమె మౌనం వహించడం, ఫోన్‌లు అందుకోవడం లేదు, మెసేజులకు స్పందించడం లేదు అన్న వార్తలతో ఆమె భర్త ఫహద్‌తో విడాకులు తీసుకుంటుందన్న గాసిప్స్ వెలుగుచూశాయి.

ఈ వార్తల నేపథ్యంలో నజ్రియా ఓ భావోద్వేగ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “కొంతకాలంగా నా వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. నా మనసు చాలా భరించలేనిదిగా ఉంది. కొన్ని ముఖ్యమైన సందర్భాలు – నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సరం వేడుకలు, నా చిత్రం విజయ వేడుకలు – అన్నిటినీ నేను మిస్ అయ్యాను. దీని కోసం నా కుటుంబానికి, స్నేహితులకు, ఫ్యాన్స్‌కి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను,” అంటూ నజ్రియా తెలిపింది.

“ఇది నా జీవితంలో చాలా కష్టమైన ఫేస్.. కానీ నేను బలంగా ఉన్నాను, త్వరలోనే కోలుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాల్సిన అవసరం నాకు ఉంది. మరికొంత సమయం ఇవ్వండి,” అంటూ నజ్రియా పేర్కొంది. నజ్రియా ఈ పోస్టును చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఆమెకు మద్దతుగా లవ్ సింబల్ షేర్ చేస్తూ కామెంట్ చేసింది.
https://www.instagram.com/p/DIgn0v7xSJm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==